
పాటల బుల్లెట్ గా ప్రసిద్ధి గాంచి బుల్లెట్ నే శరీరంలో భాగంగా చేసుకున్న అమర గాయకుడి అంతిమ ఘట్టం పూర్తయింది. కాలికి గజ్జె కట్టి బడుగు జీవుల్లో రణనినాదాన్ని పాదుగొల్పిన ఆయన సవ్వడి కడవరకూ సాగింది. ఆ గజ్జెల సవ్వళ్ల మధ్య.. తన పాటతో పరవశులైనవారి అశ్రునయనాల నడుమ ఆయన అంతిమయాత్ర సాగింది. వేలాదిగా జనం.. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయా అన్నట్లుగా.. గద్దర్ అంతిమయాత్ర కొనసాగింది. కళాకారుల ఆటపాటల మధ్య గద్దర్ అంతిమయాత్ర నిర్వహించారు. ఎల్.బి.స్టేడియం(L.B.Stadium) నుంచి మొదలైన యాత్ర గన్ పార్క్, అమర వీరుల స్థూపం మీదుగా సాగింది. ఈ యాత్రలో వేలాదిగా జనం పాల్గొని తమ అభిమాన గాయకుడి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. 17 కిలోమీటర్లు 7 గంటల పాటు సాగిన తుది యాత్రలో దారిపొడవునా జనం కన్నీటితో నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకే అంత్యక్రియలు జరుగుతాయని భావించినా.. అశేష జనవాహిని మధ్య తుది యాత్ర 7 గంటల పాటు సాగడం గద్దర్ కు ఉన్న ప్రజా బలాన్ని, బలగాన్ని కళ్లకు కట్టింది.
గద్దర్ కడచూపు కోసం భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. వారందర్నీ అదుపు చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు. అల్వాల్ లోని మహాబోధి స్కూల్ ఆవరణలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్కూల్ లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా అందరూ ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. గద్దర్ అమర్ రహే నినాదాల నడుమ బౌద్ధమత సంప్రదాయం ప్రకారం అంతిమ ఘట్టాన్ని నిర్వహించారు.
అంతకుముందు CM కేసీఆర్ అల్వాల్ చేరుకుని గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన సతీమణి విమలతోపాటు కుమారుణ్ని ఓదార్చారు. CM వెంట మంత్రులు హరీశ్ రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, బాల్క సుమన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, వి.హన్మంతరావు, సీతక్కతోపాటు ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, అభిమానులు హాజరై తుది ఘట్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు అన్ని పార్టీల నేతలు సానుభూతి తెలిపారు.