వినాయక నవరాత్రుల్లో గణేశుడి లడ్డూకు ఉండే ప్రాధాన్యతే వేరు. దాన్ని దక్కించుకునేందుకు వేల రూపాయల నుంచి లక్షల దాకా పాట పాడుతూ ఉంటారు. దేవుడి లడ్డూని సొంతం చేసుకుంటే సంవత్సరమంతా బాగుంటుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే విఘ్నేశుడి వద్ద ఉంచిన లడ్డూను చాలా జాగ్రత్తగా, భద్రంగా చూసుకుంటారు. కానీ ఆ గణేశుడి మండపం వద్ద ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. దేవుడికి సమర్పించి మండపంలో ఉంచిన భారీ లడ్డూ మాయమైంది. 21 కిలోల లడ్డూ ఏమైందబ్బా.. ఎవరైనా పెద్ద దొంగలు వచ్చి ఉంటారేమోనని అనుమానించారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో.. అసలు దొంగలు దొరికిపోయారు. ఆ లడ్డూ ఎత్తుకెళ్లింది ఎవరో తెలిశాక ఆశ్చర్యపోవడం అందరి వంతయింది.
దీనికి పాల్పడింది పాఠశాల విద్యార్థులు కావడం కొసమెరుపు. ఈ ఘటన హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాన్సీబజార్ గణేశ్ మండపంలో జరిగింది. స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడ్డ స్టూడెంట్స్… పెద్ద లడ్డూను ఎత్తుకెళ్లి తినేశారు. జరిగిన దానికి బాధపడాలో, చిన్నపిల్లలని చూసి వదిలేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది అక్కడివారికి.