అసంఘటిత రంగాల ఉద్యోగుల(గిగ్, ప్లాట్ఫాం వర్కర్ల)కు కేంద్రం శుభవార్త అందించింది. గుర్తింపు(Identity)తోపాటు ఆరోగ్యబీమా కల్పించాలని నిర్ణయించడంతో కోటి మందికి మేలు జరగనుంది. ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ఐడీలతోపాటు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల బీమా కల్పిస్తారు. వీరి సామాజిక భద్రత కోసం ప్రత్యేక స్కీమ్ తేవడంతోపాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తింపజేసే ప్రతిపాదనలున్నాయన్నారు.
గిగ్, ప్లాట్ఫాం వర్కర్లు అంటే…
వీలును బట్టి తాత్కాలికంగా ఉద్యోగాలు చేసేవాళ్లను ‘గిగ్ వర్కర్లు’గా పిలుస్తారు. యాప్(App)ల ద్వారా సేవలందించే కంపెనీల్లో ఎక్కువ మంది ఉండగా.. ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు సైతం ఇందులోకి వస్తారు. అయితే సంప్రదాయ ఉద్యోగుల మాదిరిగా వీరికి ఉద్యోగ భద్రత లేదు. దీనికోసం ఏళ్ల నుంచి డిమాండ్లు ఉన్నా ప్రయోజనం శూన్యం. దేశంలో 10 కోట్లకు పైగా గిగ్, ప్లాట్ఫాం వర్కర్లు ఉండగా, 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. గత బడ్జెట్లోనూ కొన్ని ప్రతిపాదనలు ఉన్నా అవి ఆచరణలోకి రాలేదు. కానీ ఈసారి మాత్రం మంచి నిర్ణయాలే వెలువడ్డాయి.
అయితే ఇలా చేస్తేనే…
గిగ్ వర్కర్ల పూర్తి డేటాను ప్రభుత్వానికి అందజేయాలి. అలా అయితేనే ఏయే కంపెనీల్లో ఎంతమంది పనిచేస్తున్నారనేది తెలుస్తుంది. కంపెనీల్లో ఎంతమంది పనిచేస్తున్నారన్న లెక్కల్ని అగ్రిగేటర్ కంపెనీలు ఇవ్వాల్సి ఉన్నా అందజేయట్లేదు. పూర్తి డేటా, యూనిక్ ఐడీ(UAN) ఇచ్చి ప్రత్యేక అకౌంట్ మెయింటెయిన్ చేయడం ద్వారా PF, ESI అవకాశం కల్పించాల్సి ఉంది. ఈ డిమాండ్లు గత ఐదేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నా.. ఇప్పటికైనా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విధానాల్ని వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కీంలు సక్రమంగా అమలు కావాలంటే అగ్రిగేటర్ కంపెనీల ఆలోచనాధోరణి మారాల్సి ఉందని గిగ్, ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ నేత షేక్ సలావుద్దీన్ అన్నారు.