Published 25 Jan 2024
రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముగ్గురి నియామకాల ఫైల్స్ ను ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో TSPSC ఛైర్మన్ తోపాటు తమ కోటాలోని MLCలను నియమిస్తూ గవర్నర్ సంతకం చేశారు. మాజీ DGPతోపాటు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తికి సముచిత స్థానాన్ని ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ DGP మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్ NIT సివిల్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ అయిన ఎం.మహేందర్ రెడ్డి.. ఢిల్లీ IITలో ఎం.టెక్ చదువుతున్న సమయంలోనే IPSకు సెలెక్ట్ అయ్యారు. 1986 బ్యాచ్ కు చెందిన ఈయన.. తెలంగాణ ఏర్పడ్డాక రెండో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు.
కోదండరామ్ విశిష్ట సేవలు…
గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు(MLC)లుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ నియామకాలకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ముద్దసాని కోదండరామిరెడ్డి(కోదండరామ్) ఎట్టకేలకు కీలక పదవి లభించింది. KCR విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ గత కొన్నేళ్లుగా పెద్దయెత్తున పోరాటం చేస్తున్నారు. 2018 మార్చిలో కోదండరామ్… తెలంగాణ జన సమితి(TJS) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన ఇంతకుముందు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఉమ్మడి ఏపీలో పౌరహక్కుల కమిటీతోపాటు మానవహక్కుల ఫోరం, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వరల్డ్ సోషల్ ఫోరం, తెలంగాణ విద్యావంతుల వేదిక వంటి సంస్థలకు సేవలందించారు. ఆహార భద్రత అంశం(Food Security Issue)పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో.. కమిషనర్ కు సలహాదారుగా కోదండరామ్ నియమితులయ్యారు. తెలంగాణకు చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను కీలక పదవికి నామినేట్ చేసింది.