
ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్… ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసన్నారు. RTC విలీనమన్నది సిబ్బంది ఎప్పట్నుంచో కోరుతున్న భావోద్వేగమైన అంశంగా గవర్నర్ అన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. ఫ్యూచర్ లో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని RTC సిబ్బంది అర్థం చేసుకోవాలని సూచించారు.
‘ఉద్యోగులందరి ప్రయోజనాలు రక్షించడం నా బాధ్యత.. తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాల్ని రక్షించేలా చూస్తా.. వివరణ ఇవ్వాలని కోరిన ప్రతిపాదనలపై చీఫ్ సెక్రటరీ పంపిన ఫైల్స్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి.. ఫ్యూచర్లో ఉద్యోగులు గవర్నమెంట్ లో కలిశాక ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చూడాల్సి ఉంది.. ఆ బాధ్యతనే నేను నెరవేరుస్తున్నా’ అంటూ గవర్నర్ తమిళిసై RTC ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగుల ఆందోళనను పరిష్కరించాలన్నదే తన ప్రధాన ధ్యేయమని, ప్రతిపాదిత బిల్లు పూర్తిస్థాయిలో పటిష్ఠంగా ఉందా అన్నదే తనకు ప్రధానమని గవర్నర్ వివరించారు.