గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం(Sensational Decision) తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వరాష్ట్రం(తమిళనాడు) నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయన్న మాటలు వినపడుతున్నాయి.
దేవుడు, ఏలినవారు కనికరిస్తే…
దేవుడు, ఏలినవారు కనికరిస్తే తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయం వస్తుందని తమిళిసై అన్నారు. నాడార్ సామాజికవర్గానికి చెందిన తమిళిసై.. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఒక చోటి నుంచి ఆమె పోటీకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. కన్యాకుమారి కలియక్కవిలైలో జన్మించిన ఆమె.. 2019 సెప్టెంబరు 8న తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి 18 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ తమిళిసై తండ్రి కుమారి అనంతన్.. పార్లమెంటు సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా సేవలందించారు.
నాలుగున్నరేళ్లుగా…
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నాలుగున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మొదటి మహిళా గవర్నర్(Governor) గా, రాజ్ భవన్ కు రెండో అధినేతగా బాధ్యతలు చేపట్టిన అచీవ్ మెంట్ సాధించారు. తమిళిసై అనుసరించిన పద్ధతులతో రాజ్ భవన్ కు, BRS ప్రభుత్వానికి దూరం బాగా పెరిగింది. సర్కారు పంపిన బిల్లుల్ని క్లారిఫికేషన్ పేరిట పెండింగ్ లో పెట్టడంతో వివాదం రాజుకుంది. ఆమె ఏ మాత్రం తగ్గకపోవడంతో అప్పటి CS, DGP సహా యంత్రాంగమంతా రాజ్ భవన్ కు దూరంగా ఉంది. తమిళిసై పర్యటించే ప్రోగ్రాంలకు సైతం జిల్లాల్లో అధికారులు రాకపోయేవారు.
అప్పటి మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ వెళ్లిన CM… సెక్రటేరియట్ లో ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవానికి ఆమెకు వెల్ కమ్ చెప్పారు. దగ్గరుండి సచివాలయం మొత్తం చూపించడంతో ఇక ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం తగ్గిందన్న ప్రచారం జరిగింది. కానీ కొద్దికాలానికే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గవర్నర్ నామినేటెడ్ కోటా MLC పోస్టుల విషయంలో వివాదం రాజుకుంది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలతో ఇబ్బందులేర్పడ్డాయి.