
Published 03 Jan 2024
ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తు పెట్టుకోకుంటే ఎలా… అసలే ఊర్లో లేకపోతిమి, సదస్సుకు పోలేని నాకు స్కీమ్ వస్తుందో రాదో… ఉన్న ఒక్క ఆధారం లేకుండా పోతే ఎలా… ఇదీ చాలా మందిలో ఉన్న టెన్షన్. ఎక్కడికక్కడ నిర్వహిస్తున్న సదస్సుల్లో అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశమిచ్చిన ప్రభుత్వం… ఇక నుంచి ఈ విధానాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రజాపాలన సదస్సుల మాదిరిగానే ప్రతి నాలుగు నెలలకోసారి వీటిని చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. కార్యక్రమంపై స్పష్టతనిచ్చారు.
కలెక్టర్లకు గైడ్ లైన్స్
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిరంతరం కొనసాగించడంపై CS శాంతికుమారి కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇకపై ప్రతి నాలుగు నెలలకోసారి ఈ సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల ద్వారా లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. అయినా ఇంకా దరఖాస్తు చేసుకోనివారు పెద్దసంఖ్యలో ఉన్నారని గమనించిన సర్కారు… అందరికీ పథకాల ఫలాలు అందాలన్న ఉద్దేశంతో వీటిని తరచుగా నిర్వహించాలని భావించింది.
తొలి దశ అప్లికేషన్లకు డేటా ఎంట్రీ
తొలిదశలో వచ్చిన అప్లికేషన్లకు సంబంధించిన డేటా ఎంట్రీపై ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియను ఈనెల 6 నుంచి 17 వరకు కంప్లీట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనిపై రాష్ట్రస్థాయి సిబ్బందికి ఈ నెల 4 నాడు, జిల్లాస్థాయి సిబ్బందికి 5వ తేదీన శిక్షణ ఇవ్వబోతున్నారు. లబ్ధిదారుల డేటా వివరాల్ని ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా నమోదు చేస్తారు.