కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇపుడున్న కార్డుల స్థానంలో కొత్తగా ‘స్మార్ట్’ కార్డుల్ని ప్రవేశపెట్టనుంది. కుల గణన సర్వే ఆధారంగా కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు కానుండగా.. ఇప్పటివరకు గల అన్ని కార్డుల స్థానంలో ఇక స్మార్ట్ కార్డులు తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలి(Lesislative Council) ప్రశ్నోత్తరాల్లో కోదండరామ్, మీర్జా రియాజుల్ హసన్, జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు.
సంక్రాంతి తర్వాత కొత్త కార్డుల ప్రక్రియ రానుండగా, సర్కారు లెక్కల ప్రకారం 10 లక్షల వరకు కొత్తవి ఇవ్వాల్సి ఉంది. దీంతో అదనంగా రూ.956 కోట్ల భారం పడనుండగా, నూతనంగా ఏర్పడ్డ పంచాయతీల్లో డీలర్ షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. 10 లక్షల కార్డుల వల్ల 31 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని, మరో 18 లక్షల కార్డుల్లో పేర్ల నమోదుకు అప్లికేషన్లు వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,21,907 తెల్ల రేషన్ కార్డులుంటే వాటి ద్వారా 2.7 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.