సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన సెకండ్ ANMలకు ప్రభుత్వం నుంచి హామీ లభించింది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని సర్కారు ప్రకటించడంతో ANMలు నిరసన విరమించారు. ఇక ఈ రోజు నుంచి వారంతా విధులకు హాజరు కానున్నారు. రకరకాల విభాగాల్లో NHM స్కీమ్ కింద సెకండ్ ANMల రిక్రూట్ మెంట్ జరగ్గా.. PHC, UPHC, RBSK, వారధి డిపార్ట్ మెంట్లలో టీమ్ ల వారీగా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ పేరిట గత 16 ఏళ్లుగా తమను బానిసలుగా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. కరోనా సమయంలో డాక్టర్లే భయపడ్డ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గంటకు 200 ఇంజక్షన్లు ఇచ్చామని, అలాంటిది తమను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్ మెంట్ కీలక స్థానంలో ఉందంటే అది తమ వల్లేనని సెకండ్ ANMలు అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,553 మంది సెకండ్ ANMలు ఉండగా.. ఏ డిపార్ట్ మెంట్లో లేని విధంగా ఫస్ట్ ANM, సెకండ్ ANMల పేరిట విడగొట్టి తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఎలాంటి షరతుల్లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారుణ్య, ఆగ్జిలరీ, సూపర్ న్యూమరరీ పోస్టులతో మరీ VRAలను అడ్జస్ట్ చేశారని, మరి తమను అలా ఎందుకు కౌంట్ చేయడం లేదంటూ సెకండ్ ANMలు ఆవేదన చెదుతున్నారు. 53, 54 ఏళ్ల వయసులోనూ కళ్లు కనపడక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి తమను ఎక్కడికక్కడే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత పనిచేస్తున్నా ఎక్స్ గ్రేషియా, బీమాల వంటి సౌకర్యాలు ఏమీ లేవని మండిపడ్డారు. ఈ సమస్యలపై గత కొంతకాలంగా సెకండ్ ANMలు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఇప్పటికైనా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ తమ సమస్యలపై దృష్టిపెట్టాలని సెకండ్ ANMలు కోరుతున్నారు.