ఎల్ఆర్ఎస్(Layout Regularisation Scheme) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల క్రితం 2020లో స్వీకరించిన LRS అప్లికేషన్లకు సంబంధించిన లేఅవుట్లలోని ప్లాట్లు క్రమబద్ధీకరించా(Regularisation)లని నిర్ణయించింది. మార్చి 31 లోపు మొత్తం రుసుం(Total Fee) చెల్లించిన ప్లాట్లకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో తెలియజేసింది. గతంలో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నది. ఆదాయ సమీకరణపై వాణిజ్య పన్నులు, రవాణా, గనుల శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
వివాదాలు తప్ప అన్నింటికీ…
వివాదాలు ఉన్న భూములు మినహా అన్ని ల్యాండ్స్ కు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్న భూములతోపాటు ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములకు ఈ నిబంధన(Rule) వర్తించదని తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మొత్తం 25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్పిస్తున్న మూడో అవకాశమిది.
అనధికారిక స్థలాలను క్రమబద్ధీకరించాలని 2020లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆగస్టు 31-అక్టోబరు 31లోపు దరఖాస్తులు స్వీకరించింది. ఈ గడువు లోపు అప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన భూముల రెగ్యులరైజేషన్ చేయాలని భావించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు(Apply) చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో భారీగా అప్లికేషన్లు వచ్చినా… చాలా చోట్ల వివాదాలు ఏర్పడటం, వాటిపై కోర్టుల్లో కేసులు విచారణకు రావడంతో ఆ ప్రక్రియంతా నిలిచిపోయింది.
ఎల్ఆర్ఎస్ లేక అవస్థలు…
భవన నిర్మాణాల అనుమతుల కోసం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. LRS లేకపోవడంతో నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడి ఎక్కడికక్కడే నిలిచిపోయేవి. LRS అనేది ఒక డిస్కౌంట్ స్కీమ్ లా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం భారీగా ఆదాయం వచ్చిపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా విధివిధానాలు(Guidelines) బయటకు రాలేదు.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ లేని సమయంలో యజమానులు.. మూడు వంతుల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. ఈ LRSను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా అటు ల్యాండ్ ఓనర్లకు వెసులుబాటు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం అన్నట్లుగా ఉంటుంది. ఒకసారి LRS పూర్తి చేసుకుంటే శాశ్వత(Life Time) ప్రాతిపదికగా పర్మిషన్ పొందినట్లే.
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన అప్లికేషన్లు
మున్సిపల్ కార్పొరేషన్లు – 4.13 లక్షలు
మున్సిపాలిటీలు – 10.54 లక్షలు
గ్రామ పంచాయతీలు – 10.76