ఆరు గ్యారంటీ(Six Guarantees)ల్లో భాగంగా మహాలక్ష్మీ స్కీమ్ లో అందిస్తున్న రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ సిలిండర్ అందుతుందని స్పష్టం చేసింది. ఈ రోజు(ఫిబ్రవరి 27) నుంచి అమలు చేయనున్న రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన జీవో(Government Order)ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. లబ్ధిదారుల అర్హతలు, విధివిధానాలు, సబ్సిడీ బదిలీకి సంబంధించిన సమాచారాన్ని జీవోలో తెలియజేసింది. ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయబోతున్నారు.
ప్రజాపాలన దరఖాస్తులకే…
తెల్ల రేషన్ కార్డులు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు(Apply) చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం(Subsidy Cylinder) వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు అనేది లెక్కగట్టి దాని ఆధారంగానే ఈ సిలిండర్లను అందించనుంది. నగదు బదిలీకి సంబంధించి కూడా విధివిధానాలను G.O.లో పేర్కొంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది మహిళా లబ్ధిదారుల(Beneficiaries)ను గుర్తించింది ప్రభుత్వం. తొలి దశలో వీళ్లకు మాత్రమే సబ్సిడీ అందుతుంది. లబ్ధిదారులకు అందించే సబ్సిడీకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్లాట్ ఫామ్ గా పనిచేయనుండగా.. నోడల్ బ్యాంకుగా SBI ఉంటుంది.
త్వరలోనే గైడ్ లైన్స్..
ముందుగా సిలిండర్ కు పూర్తి డబ్బులు(రూ.955 ప్రస్తుతం.. లేదంటే ఎంత ఉంటే అంత) చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బు మొత్తాన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తుంది. ఆ సబ్సిడీ మొత్తాన్ని ఆయా కంపెనీలే లబ్ధిదారుల అకౌంట్లలో వేయాల్సి ఉంటుందన్నది అందులోని సారాంశం. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో గైడ్ లైన్స్ రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే సిలిండర్ తీసుకున్న తర్వాత 48 గంటల్లోనే లబ్ధిదారుల అకౌంట్లలో సబ్సిడీ వేయనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
రెండు శాఖల కసరత్తు..
ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఆర్థిక(Finance), పౌరసరఫరాల(Civil Supply) శాఖలు విధివిధానాలు రూపొందించనున్నాయి. ఈ పథకాన్ని కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఎవరైనా అర్హులై ఉండి సబ్సిడీ సిలిండర్ అందుకోనివారి కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. చివరకు లబ్ధిదారులకు ఎంత సబ్సిడీ చేరిందన్న విషయాలు ప్రజాపాలన పోర్టల్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.