Published 08 Jan 2024
ప్రజాపాలనలో భాగంగా ఆరు పథకాల(Six Schemes) అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీని వేగవంతం చేసిన సర్కారు.. ఇక వాటి వడపోతపై దృష్టిపెట్టింది. ఈ ఆరు పథకాల్ని అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిజమైన లబ్ధిదారులకు స్కీమ్ లు అందేలా ఈ సబ్ కమిటీ పర్యవేక్షణ చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్ గా.. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ నిర్వర్తించాల్సిన విధివిధానాల(Guidelines)పై మంత్రి వర్గ(Cabinet Meeting)లో నిర్ణయించనున్నారు.
ఊహించని రీతిలో అప్లికేషన్లు…
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన సదస్సులకు అనూహ్య స్పందన లభించిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చేపట్టిన రివ్యూ తర్వాత ఆ విషయాల్నిమంత్రులు తెలిపారు. మొత్తంగా కోటీ 25 లక్షల అప్లికేషన్లు వస్తే అందులో అభయహస్తం హామీలకే 1.05 కోట్ల దరఖాస్తులు ఉన్నాయని తెలియజేశారు. మిగతా 20 లక్షలు వివిధ స్కీమ్ లకు సంబంధించినవన్న మంత్రులు… వీటి అమలుకు ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు.