
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, అన్నిచోట్ల నుంచి విమర్శలు, నేషనల్ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అబ్జర్వేషన్ దృష్ట్యా సర్కారు సమాలోచనలు ప్రారంభించింది. దీనిపై నీటిపారుదల శాఖ(Irrigation Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ రివ్యూ నిర్వహించారు. CM OSDతోపాటు ఈఎన్సీలు, CEలతో చర్చలు జరిపారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలపై తగిన సమాధానం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సర్కారు మూడేళ్లలో పూర్తి చేసింది. తెలంగాణ-మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజ్ వంతెన కుంగిపోయింది. అక్టోబరు 22న పెద్ద సౌండ్ తో పిల్లర్ దెబ్బతినడంతో 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఇంజినీర్లు హుటాహుటిన బ్యారేజీలోని 10 TMCల నీటిని విడుదల చేశారు.
జరిగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కూడిన టీమ్ ను కేంద్ర జల్ శక్తి శాఖ తెలంగాణకు పంపించింది. బ్యారేజీని పరిశీలించిన అనంతరం రాష్టం నుంచి 20 అంశాలపై వివరణ కోరింది. 20కి 18 అంశాలపై వివరణ ఇవ్వగా.. మరో రెండు అంశాలపై క్లారిట ఇవ్వాల్సి ఉంది. అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం నిర్మాణంలో లోపం ఉందని చెప్పడంతోపాటు పిల్లర్ల కింద ఇసుక కోతకు గురైందని క్లారిటీ ఇచ్చింది. అటు అన్నారం బ్యారేజీ వద్ద ఏర్పడిన సీపేజీని సైతం అథారిటీ టీమ్ పరిశీలించింది.