తెల్లవారితే ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. పండుగ వాతావరణం నడుమ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరి హడావుడిలో వారున్నారు. వారం రోజుల నుంచి వరుడు.. పెళ్లి పనుల కోసం తిరుగుతున్నాడు. తన పెళ్లికి రావాలంటూ అందరికీ ఆహ్వాన పత్రికలు పంచాడు. అనుకున్నట్లుగానే దగ్గరి బంధువులు అప్పటికే వేడుక కోసం తరలిరాగా.. ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఇలాంటి ఆనందకర పరిస్థితుల్లో ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలో వారం పాటు విపరీతంగా ప్రయాణం చేయడంతో ఆ పెళ్లికొడుకు వడదెబ్బకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచాడు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన యువకుడు తిరుపతి(26) మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. భీమిని మండలానికి చెందిన యువతితో బుధవారం పొద్దున్నే వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే దారుణం జరిగింది.