గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పాత ప్రకటనను రద్దు చేసిన కొద్దిసేపటికే.. కొత్త నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటన ఇచ్చింది. 563 పోస్టులతో వచ్చిన ఈ ప్రకటన ద్వారా మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటారు. ఏడాదిన్నర కాలానికి పైగా వివాదాస్పదంగా తయారైన పాత గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల(మార్చి) 14 వరకు దరఖాస్తులు తీసుకుంటారు.
పాతది క్లోజ్…
2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీల కారణంగా ఈ పరీక్షను TSPSC రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి గ్రూప్-1 పరీక్షను నిర్వహించగా… భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు 2.30 లక్షల మంది అటెండ్ అయ్యారు. అయితే ఈ ఎగ్జామ్ పైనా పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. అభ్యర్థుల బయోమెట్రిక్ ను సరిగా తీసుకోలేదని, ప్రిలిమినరీ జరిగిన రోజు ఇచ్చిన సంఖ్యకు తుది కీ టైమ్ ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షల్ని న్యాయస్థానం రద్దు చేసింది.
మళ్లీ కొత్త కొత్తగా…
తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్ లో భాగంగా అభ్యర్థులు మళ్లీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలో ఇచ్చిన ఉద్యోగాలకు అనుగుణంగా మళ్లీ కొత్తగా అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని TSPSC క్లారిటీ ఇచ్చింది. ఈ లెక్కన గతంలో దరఖాస్తు చేసుకున్నా.. ఈ సారి మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రకటనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నోటిఫికేషన్(Latest Notification) లో ఫీజు మినహాయింపు ఉండనుంది.
నోటిఫికేషనల్ ఇలా…
23-02-2024 నుంచి 14-03-2024(5 PM) : ఆన్ లైన్ అప్లికేషన్లు
23-03-2024 నుంచి 27-03-2024 : అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్
మే / జూన్ 2024 : ప్రిలిమినరీ పరీక్షలు(ఆబ్జెక్టివ్ టైప్)
సెప్టెంబరు / అక్టోబరు : మెయిన్స్ ఎగ్జామ్స్(కన్వెన్షనల్ టైప్)