రెండుసార్లు రద్దయి అభాసుపాలవడంతోపాటు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకున్న గ్రూప్-1 ప్రిలిమినరీ(Preliminary) పరీక్షను.. మరోసారి నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. కొత్త ప్రభుత్వం.. కొత్త నోటిఫికేషన్, కొత్త ఎగ్జామ్ అన్నట్లుగా.. ఏకంగా ప్రిలిమ్స్ తేదీని ఫిక్స్ చేసినట్లు TSPSC ప్రకటించింది. ఈ ఎగ్జామ్ ను ఈ జూన్ 9న నిర్వహిస్తామని తెలియజేసింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పాత ప్రకటనను ఈ నెల 19న రద్దు చేసిన కొద్దిసేపటికే.. కొత్త నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటన ఇచ్చింది. 563 పోస్టులతో వచ్చిన ఈ ప్రకటన ద్వారా మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల(మార్చి) 14 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు.
కొత్త కొత్తగా…
2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీల కారణంగా ఈ పరీక్షను TSPSC రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి గ్రూప్-1 పరీక్షను నిర్వహించగా… భారీ సంఖ్యలో 2.30 లక్షల మంది అటెండ్ అయ్యారు. అయితే ఈ ఎగ్జామ్ పైనా పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. అభ్యర్థుల బయోమెట్రిక్(Biometric) ను సరిగా తీసుకోలేదని, ప్రిలిమినరీ జరిగిన రోజు ఇచ్చిన సంఖ్యకు తుది కీ వెల్లడించిన సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షల్ని న్యాయస్థానం రద్దు చేసింది.