
గ్రూప్-1 పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తీర్పునిచ్చింది. ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీసుకున్న నిర్ణయం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై నిన్న, ఈరోజు వాదనలు కొనసాగాయి. TSPSC వాదనల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం.. గ్రూప్-1 మళ్లీ నిర్వహించాల్సిందేనని తీర్పునిచ్చింది. రెండోసారి బయోమెట్రిక్(Biometric) సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన హైకోర్టు(High Court)… గ్రూప్-1 ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహిస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించింది. రెండోసారి నిర్వహించిన పరీక్షను 50 వేల మంది రాయలేదని.. వ్యవస్థపై నమ్మకం లేకే వారంతా ఎగ్జామ్స్ రాయలేదని స్పష్టం చేసింది. దీంతో కమిషన్ చేసుకున్న అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.
ముగ్గురి కోసం రద్దు చేయడమా..
ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పిటిషన్ వేశారని, ఆ ముగ్గురి కోసమే పరీక్ష రద్దు చేయడం సరికాదని అడ్వొకేట్ జనరల్(AG) వాదించారు. బయోమెట్రిక్ పెట్టడం, పెట్టకపోవడమన్నది TSPSC నిర్ణయాధికారం కిందకు వస్తుందని, నిబంధనలు సరిచేసుకునే వెసులుబాటు కమిషన్ కు ఉందని AG అన్నారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు… నిర్ణయాన్ని ప్రకటించింది.
సింగిల్ బెంచ్ తీర్పు ఇదే…
గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ అమలు చేస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించినా.. దాన్ని అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పిటిషనర్లు ఆరోపించారు. ఈ వాదనను సింగిల్ బెంచ్ సమర్థించింది. పరీక్ష జరిగిన తర్వాత ప్రకటించిన సంఖ్యకు 15 రోజుల తర్వాత వెల్లడించిన లెక్కలకు 250 మందికి పైగా పేర్లు ఎక్కువగా రావడంపైనా పిటిషనర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయలేకపోయామని TSPSC న్యాయవాది చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అనుమానాలు నెలకొన్న గ్రూప్-1ను రద్దు చేయడమే మేలని.. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ప్రకటించింది.