వివాదాలకు కేంద్రంగా మారిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీల కారణంగా ఈ పరీక్షను TSPSC రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి గ్రూప్-1 పరీక్షను నిర్వహించగా… భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు 2.30 లక్షల మంది అటెండ్ అయ్యారు. అయితే ఈ ఎగ్జామ్ పైనా పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. అభ్యర్థుల బయోమెట్రిక్ ను సరిగా తీసుకోలేదని, ప్రిలిమినరీ జరిగిన రోజు ఇచ్చిన సంఖ్యకు తుది కీ టైమ్ ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
డివిజన్ బెంచ్ సైతం…
విచారణ చేపట్టిన హైకోర్టు.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై ద్విసభ్య ధర్మాసనాని(Division Bench)కి TSPSC అప్పీల్ చేస్తే డివిజన్ బెంచ్ సైతం మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని తీర్పునిచ్చింది. దీంతో TSPSC అధికారులు న్యాయ నిపుణులతో చర్చించిన మీదట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కొత్త కమిటీ TSPSCలో కొలువుదీరడంతో పాత నోటిఫికేషన్ పై పునరాలోచన చేశారు. అటు సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. మరో 60 గ్రూప్-1 పోస్టుల్ని కలిపి 563కు పెంచారు. అయితే పాత నోటిఫికేషన్ లో కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ మొత్తం పోస్టుల్ని రిక్రూట్ చేయాలని TSPSC నిర్ణయం తీసుకుంది.