గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court Of Telangana) రద్దు చేసింది. అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హాల్ టికెట్ నంబర్ లేకుండా OMR షీట్లు ఇచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. జూన్ 11న గ్రూప్-1 ఎగ్జామ్ ను TSPSC నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం 500 పోస్టులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఎగ్జామ్ నిర్వహించగా.. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీంతో ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ జూన్ 11న నిర్వహించారు. ఈ పరీక్షను 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు.
అన్నీ అనుమానాలేనన్న పిటిషనర్లు
రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ నిర్వహించినపుడు అందరి బయోమెట్రిక్ తీసుకున్నారు.. కానీ తిరిగి పరీక్ష పెట్టిన సమయంలో బయెమెట్రిక్ సేకరించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహించిన తీరు సరిగా లేదంటూ పిటిషన్ లో క్యాండిడేట్స్ తెలియజేశారు. జూన్ 11 నాటి ప్రిలిమ్స్ పరీక్ష OMR షీట్ పైన అభ్యర్థి హాల్ టికెట్ నంబరు, ఫొటో ఈ రెండిండ్లో ఏ ఒక్కటి కూడా లేకపోవడంతో అనుమానాస్పదంగా తయారైందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఇన్ని అనుమానాల మధ్య కాకుండా పారదర్శకం(Transparant)గా నిర్వహించాల్సిన బాధ్యత TSPSCపై ఉందని కోర్టుకు విన్నవించారు. అందుకే దీన్ని రద్దు చేసి మరోసారి పూర్తి పారదర్శకంగా గ్రూప్-1 ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు. పరీక్షల నిర్వహణ తీరు, సరిగా నిర్వహించని సమయాల్లో వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు గతంలో వెలువరించిన తీర్పులను పిటిషనర్ల లాయర్లు న్యాయమూర్తి ఎదుట ఉంచారు.
వివిధ కోర్టుల తీర్పులే ఉదాహరణగా…
పరీక్షల నిర్వహణ తీరు, సరిగా నిర్వహించని సమయాల్లో వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు గతంలో వెలువరించిన తీర్పులను పిటిషనర్ల లాయర్లు న్యాయమూర్తి ఎదుట ఉంచారు. న్యాయం జరగని సమయంలో తమకు ప్రశ్నించే హక్కు ఉందంటూ పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అయితే పరీక్షను ఇబ్బందులు లేకుండానే సజావుగా నిర్వహించామని, 3 లక్షల మందిలో కేవలం కొంతమంది మాత్రమే అభ్యంతరం తెలుపుతున్నారని TSPSC తరఫున అడ్వొకేట్ జనరల్(AG) ప్రతివాదనలు కొనసాగించారు. కమిషన్ కు ఉన్న విధివిధానాల(Guidelines) ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేశామని, UPSC సిస్టమ్ లోనే TSPSC పనిచేస్తుంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలను ఇంతకుముందే విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. చివరకు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం… ఎగ్జామ్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. క్యాన్సిల్ చేసిన పరీక్షను మళ్లీ పెట్టాలని ఆదేశించగా… ఇందుకు సంబంధించిన తీర్పు కాపీ అందించాలని TSPSC న్యాయవాదులు కోరారు. తీర్పు కాపీ అందిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కమిషన్ వర్గాలు అంటున్నాయి.