రాష్ట్రంలో అధికారానికి కారణంగా నిలిచిన ఆరు గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సారించింది. గత పదేళ్ల కాలంలో జరిగిన ప్రభుత్వ లావాదేవీల్ని బేరీజు వేసుకుంటూ గ్యారెంటీల్ని అమలు చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆరింటికి గాను ఈ నెల 9 నుంచి రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నామని ప్రకటించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశమైన కొత్త మంత్రివర్గం.. రెండు గ్యారెంటీల అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ వివరాల్ని ఆర్థిక శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు కానుంది.
2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి తెలిపారు. ఇందుకు గాను అన్ని శాఖల ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. 24 గంటల కరెంటు విషయంలోనూ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.