కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనకు సమయం దగ్గర పడుతున్న వేళ… గతంలో హామీ ఇచ్చిన పథకాలపై ముందడుగు పడబోతున్నది. అనుకున్నట్లు జరిగితే మరో 25 రోజుల్లోనే ఇంకో నాలుగు పథకాలు(Four Schemes) అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రకటించారు. ఇక CM ప్రకటించారంటే ఇక అవి అమలు కావడమే తరువాయి అన్న మాటలు వినపడుతున్నాయి. వారం రోజుల్లో రెండు స్కీమ్ లు, ఆ తర్వాత మరో రెండు స్కీమ్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏవి ఎప్పుడంటే…
ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులకు సైతం పెద్దయెత్తున హామీల్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా, రైతు బంధు నిధుల్ని ఖాతాల్లో వేయాల్సి ఉంది. అటు గృహజ్యోతి కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత కరెంటు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రూ.500 గ్యాస్ సిలిండర్ ను సైతం అందివ్వాల్సి ఉండగా… వారం రోజుల్లోనే ఈ రెండింటిని అమలు చేయనున్నారు.
వచ్చే నెల 15 లోపు…
పంటల పెట్టుబడి సాయంగా అందించే పథకాన్ని వచ్చే నెలలో(Next Month) అమలు చేస్తామని ముఖ్యమంత్రి… కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రకటించారు. ఈ లెక్కన వచ్చే నెల 15 లోపు రైతుబంధు, రైతు భరోసా అమలు కానుంది. రైతు భరోసా కోసం రైతులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. డిసెంబరులో యాసంగి పంటలకు ముందుకు వస్తే.. ఫిబ్రవరి దాటుతున్నా ఖాతాల్లో(Accounts) డబ్బులు పడలేదు. దీంతో రేవంత్ సర్కారుపైనా క్రమంగా ఒత్తిడి పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా ఆయనే ప్రకటన చేయడంతో రైతుల్లో ఆశలు కనిపిస్తున్నాయి. అటు రూ.2 లక్షల రుణమాఫీ కూడా అప్పుడే అమలు చేయబోతున్నట్లు CM తెలిపారు.