గురుకులాల్లో ఉద్యోగ నియామకాల కోసం ఈరోజు నుంచి పరీక్షలు(Exams) జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు గురుకులాల రిక్రూట్ మెంట్ బోర్డు కన్వీనర్ మల్లయ్య బట్టు తెలిపారు. 17 జిల్లాల్లో 106 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని, మొదటిసారిగా ఆన్ లైన్(Online)లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు అర గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తోపాటు ఏదైనా ID కార్డు తీసుకురావాలని సూచించారు. క్వశ్చన్ పేపర్ ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు తెలియజేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9,210 పోస్టులకు 2,63,045 మంది క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు. ఒక్కో ఎగ్జామ్ కు రెండు గంటల సమయం ఉండగా.. పొద్దున 8:30 నుంచి 10:30 వరకు… మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 దాకా… సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. రెండు మూడు ఎగ్జామ్స్ రాసేవారు హాల్ టికెట్లు భద్రంగా ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.