Published 30 Jan 2024
అత్యవసర పరిస్థితు(Emergency Situations)ల్లో సరైన వైద్యం అందించాలంటే ఇపుడున్న వ్యవస్థ ద్వారా సాధ్యం కావడం లేదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో నూతన విధానం(System)పై దృష్టి సారించినట్లే కనపడుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాని(Health)కి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. యునిక్ నంబర్(Unique Number)తో కూడిన హెల్త్ ప్రొఫైల్ కార్డుల దిశగా అడుగులు వేయాల్సి ఉందని గుర్తు చేశారు. వైద్యారోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో సమీక్ష నిర్వహించిన CM.. హైల్త్ ప్రొఫైల్ కార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆరోగ్యశ్రీతో అనుసంధానం…
కొత్తగా తయారు చేయాలనుకున్న హెల్త్ ప్రొఫైల్(Health Profile) కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులతో అనుసంధానం(Link) చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్న నిబంధనపై సడలింపు ఇచ్చే ఆలోచన చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రేషన్ కార్డును ఆరోగ్యశ్రీకి దూరం పెడితే రాష్ట్రంలో కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయానికి వచ్చారు. ఎక్కువ మంది జనం ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డులు తీసుకుంటున్నట్లు ముందునుంచీ భావిస్తున్న రేవంత్ రెడ్డి.. వాటిని తగ్గించాలంటే ఇలాంటి విధానాలు పాటించాల్సి ఉందన్నారు.