
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పెన్ గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో బ్రిడ్జి(Bridge)ని తాకుతూ పెన్ గంగ ప్రవహిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(U) లో 23.15 సెంటీమీటర్లు నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం రికార్డయిన ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనివే ఎక్కువగా ఉన్నాయి. అటు ఆదిలాబాద్ పట్టణంలోనూ వివిధ కాలనీలు జలమయమయ్యాయి.
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద(Flood) నీరు వచ్చి చేరుతోంది. 18 గేట్లలో 14 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు. సాత్నాల, గడ్డెన్న, స్వర్ణ జలాశయాలకు సైతం భారీస్థాయిలో వరద నీరు వస్తోంది. దీంతో ఆయా ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా విడిచిపెడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో పెద్దయెత్తున పంట నష్టం కలిగింది.