ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరి నదికి భారీ వరద వచ్చి చేరింది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. మేడిగడ్డ(Medigadda)కు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. అక్కడ గేట్లన్నీ తెరచుకుని ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రహదారులపై నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 12.5 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 10.2, కుమురం భీమ్ జిల్లా కుంచవల్లిలో 9.5, మంచిర్యాల జిల్లా భీమినిలో 9.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈరోజు పొద్దున 8:30 నుంచి 10 వరకు.. గంటన్నరలోనే ఈ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.