హైదరాబాద్ జంట నగరాల్లోని రోడ్లు మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకున్నాయి. మరోసారి కుండపోత వర్షం పడటంతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జంటనగరాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం(Rainfall) రికార్డయింది. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు పెద్దయెత్తున వరద వస్తుండటంతో రెండు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. అమీర్ పేట, బంజారాహిల్స్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ లో బయటకు రావొద్దని GHMC అధికారులు అంటున్నారు.
పలు సర్కిళ్లలో 12 సెంటీమీటర్లకు పైగా..
రాజేంద్రనగర్ సర్కిల్ లో 12 సెంటీమీటర్లు, కూకట్ పల్లి సర్కిల్ లో 12.7, చందానగర్ సర్కిల్ లో గత 24 గంటల్లో 14.1 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్ సర్కిల్ లో 12, యూసుఫ్ గూడ పరిసరాల్లో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాల దృష్ట్యా హైదరాబాద్ కు ‘రెడ్ అలర్ట్’ జారీ అయింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం GHMC కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. GHMC హెల్ప్ లైన్ నంబరు 040-2111 1111.. EVMD కంట్రోల్ రూమ్ 90001 13667 నంబర్లకు ఫోన్ చేయాలని కమిషనర్ తెలియజేశారు.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాల్లో అలర్ట్ గా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ఉదయం 8:30 గంటల వరకు 8 జిల్లాల్లో పెద్దయెత్తున వానలు ఉంటాయని ప్రకటించింది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.