రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అకాల వర్షాలతో పంటలు(Crops) కోల్పోతుండగా, ఇవాళ కూడా పెద్దయెత్తున వర్షాలుంటాయని చెప్పడంతో పూతకొచ్చే పంట కూడా నేలరాలే ప్రమాదం ఏర్పడింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీస్థాయిలో వానలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు(Winds) వీచే ఛాన్సెస్ ఉన్నాయని స్పష్టం చేసింది.
ఆ జిల్లాలకు అలర్ట్…
భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితులున్న దృష్ట్యా కొన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్(Yellow Alert)’ జారీ చేసింది. మొత్తం 5 జిల్లాలు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వచ్చే మూడు రోజులూ ఇదే పరిస్థితి ఉండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ చెబుతున్నది. నిన్న సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలో బాగా వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలో చెట్టు కొమ్మ మీద పడి టెన్త్ క్లాస్ చదువుతున్న బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మెదక్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారి గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడకు బలంగా తాకింది. తలకు తీవ్రంగా దెబ్బతాకడంతో దవాఖానా(Hospital)కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.