గవర్నర్ కోటా MLC విషయంలో సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఆనాటి KCR సర్కారు పాలనలో మొదలైన MLC నియామకాలు.. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో మరోసారి నిలిచిపోవాల్సి వచ్చింది. హైకోర్టు(High Court) తాజా ఆదేశాలతో కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం(Oath) వాయిదా పడింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసిన న్వాయస్థానం… అప్పటివరకు ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయకూడదంటూ స్టేటస్ కో విధించింది.
కోర్టులో బీఆర్ఎస్ నేతల పిటిషన్లు…
గత BRS ప్రభుత్వం గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమించినా… తమ ఎంపిక విషయంలో గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటూ ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మంత్రిమండలి(Cabinet) తీర్మానం చేసి పంపినా గవర్నర్ ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ వీరి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. దీనిపై వాదోపవాదనలను విన్న కోర్టు.. కోదండరామ్, అలీఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన ఈ ఇద్దరి నియామకాలకు గవర్నర్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
రాజ్యాంగ పరిధిలోనే…
అటు రాజ్ భవన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ నేపథ్యం ఉండటం వల్లే వీరి నియామకాల ఫైల్ ను తిప్పి పంపినట్లు గుర్తు చేశారు. MLCలుగా కోదండరామ్, మీర్ అమీర్ ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వాస్తవానికి నిన్ననే వీరిద్దరూ ప్రమాణం చేయాల్సి ఉన్నా శాసనమండలి ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది.
Published 30 Jan 2024