దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న(Demolish) హైడ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. హైడ్రా తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలు కూల్చివేయడంపై పిటిషన్ దాఖలైంది. ఈ వాదనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివరణ స్వీకరించకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది.
జీవో 99 రద్దు, హైడ్రా అధికారాల మీద దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అమీన్ పూర్లో ఈనెల 3న షెడ్లు కూల్చివేయడంతో పిటిషన్ దాఖలు కాగా.. జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణకు స్వీకరించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆలిండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి ఉండాలని, కానీ అందుకు భిన్నంగా నియమించారని కోర్టుకు పిటిషనర్ వివరించారు. GHMCకి ఉన్న విచక్షణాధికారాలను హైడ్రాకు ఇవ్వడం సరికాదంటూ వాదనలు సాగాయి.