
గ్రూప్-1 రీవాల్యుయేషన్ చేపట్టాలంటూ సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు.. TGPSCకి రెండు ఆప్షన్లు ఇచ్చింది. తమ ఆదేశాలు పాటించకపోతే మరోసారి మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మెయిన్స్ అభ్యర్థులందరి పేపర్లు పునర్ మూల్యాంకనం చేపట్టాలనేది తొలి ఆప్షన్. సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలన్నది రెండో ఆప్షన్. మొత్తంగా 8 నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలని జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ఆదేశించారు. సంజయ్ సింగ్ వర్సెస్ UPSC తీర్పును జడ్జి ప్రస్తావించారు. రీవాల్యుయేషన్లో మోడరేషన్ విధానం పాటించాలని ఆదేశించారు. అన్ని భాషల్లో రాసిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ఉండాలన్నది మోడరేషన్ విధానం.
కేసు విచారణలో అంతకుముందు పోటాపోటీ వాదనలు సాగాయి. కోఠిలో మహిళలకు కేటాయించిన సెంటర్ నుంచే ఎక్కువ మంది అర్హత సాధించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇంకో పరీక్ష కేంద్రంలోనూ పక్కపక్కనే కూర్చున్న అభ్యర్థులకు ఒకేలా మార్కులు రావడమే అవకతవకలకు కారణమన్నారు. వీటిని TGPSC న్యాయవాది కొట్టిపడేశారు. అయితే ఆర్డర్స్ ఇచ్చే దశలో ఉన్నందున రద్దు చేయొద్దంటూ సెలక్టెడ్ క్యాండిడేట్ల లాయర్లు వాదించారు.