సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన IAS అధికారులకు అక్కడా షాక్ తగిలింది. పిటిషన్ ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం.. వెంటనే సొంత కేడర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని, సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని స్పష్టం చేసింది. ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందేనంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(CAT) హైదరాబాద్ బెంచ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
వాకాటి కరుణ, వాణీప్రసాద్, అమ్రపాలి కాటా, డి.రొనాల్డ్ రోస్, జి.సృజన, హరికిరణ్, శివశంకర్ లకు CATలో వ్యతిరేక తీర్పు రాగా.. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్, అమ్రపాలి APకి… అక్కణ్నుంచి హరికిషన్, శివశంకర్, జి.సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. కేటాయించిన రాష్ట్రాల్లో చేరేందుకు గడువు నేడే ముగియడంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడా షాక్ తగలడంతో ఇక సొంత కేడర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.