శాసనమండలి సభ్యుల(MLC) నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇద్దరు MLCలను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) కొట్టివేసింది. దీంతో ఈ ఇద్దరి నియామకంపై సందిగ్ధత వీడినట్లయింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను కాంగ్రెస్ సర్కారు MLCలుగా నియమించిన సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వంలో…
గత ఎన్నికలకు ముందు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను MLCలుగా నియమిస్తూ అప్పటి BRS సర్కారు గవర్నర్ కు నోట్ ఫైల్ పంపింది. అయితే ఈ ఇద్దరూ రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేరంటూ గవర్నర్ తమిళిసై తిప్పి పంపారు. దీనిపై ఈ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించగా… ఆ తర్వాత కొద్దిరోజులకు కోదండరామ్, అమీర్ అలీఖాన్ ను రేవంత్ సర్కారు MLCలుగా నామినేట్ చేసింది. ఈ నియామకాల్ని సవాల్ చేస్తూ వాటిని రద్దు చేయాలని కోరుతూ శ్రవణ్, సత్యనారాయణ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ జనవరి 31 ఈ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న టైమ్ లో అదే నెల 30 తేదీన అంటే ఒకరోజు ముందే కోదండరామ్, అలీఖాన్ నియామకాలపై కోర్టు స్టే విధించింది.
గవర్నర్ కు లేదంటూ…
మంత్రిమండలి నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదంటూ శ్రవణ్, సత్యనారాయణ తరఫు లాయర్లు వాదించారు. దీనిపై అటు గవర్నర్ కార్యాలయ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయాన్ని తిప్పి పంపే అధికారం గవర్నర్ కు రాజ్యాంగం కల్పించిందని, తన కోటాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విచక్షణాధికారం ఆ రాజ్యాంగబద్ధ పదవికి ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడమే గవర్నర్ బాధ్యత కాదంటూ గుర్తు చేశారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ లాయర్లు సుదీర్ఘంగా వాదిస్తూ… వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ కోటాలో నియమితులైన వ్యక్తుల రాజకీయ నేపథ్యం గురించి కోర్టు దృష్టికి తెచ్చారు.
అవి చెల్లవంటూ…
మూడు వర్గాల వాదనలు విన్న హైకోర్టు… కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలు చెల్లవంటూ తీర్పునిచ్చింది. BRS ఎమ్మెల్సీల నియామకాలపై అప్పటి సర్కారు నోట్ ను గవర్నర్ రిజెక్ట్ చేయడం తగదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం… మంత్రి మండలి నిర్ణయాన్ని తిప్పి పంపాలే తప్ప తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని గవర్నర్ కు కోర్టు సూచించింది.