మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట(Relief) దక్కింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు(Orders) సరిగా లేవని అభిప్రాయపడుతూ అక్కడ పిటిషన్ వేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైన ఉదంతం మీద KCRతోపాటు హరీశ్ రావుపై పిటిషన్ దాఖలు చేయగా, సెషన్స్ కోర్టు ఆ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగుబాటుపై మామ, అల్లుడితోపాటు అప్పటి నీటిపారుదల కార్యదర్శి రజత్ కుమార్, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తోపాటు మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డికి జిల్లా కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. భూపాలపల్లి కోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఈ ఇద్దరి తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనల్ని విన్న న్యాయస్థానం.. కింది కోర్టు ఆదేశాలు సరిగా లేవన్న నిర్ణయానికి వస్తూ తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.