DSC-2008 ఉద్యోగ నియామకాల విషయంలో హైకోర్టు ఆగ్రహం(Serious) వ్యక్తం చేసింది. తామిచ్చిన ఆదేశాల్ని కూడా పట్టించుకోరా అంటూ విద్యాశాఖపై మండిపడింది. దీన్ని కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందంటూ ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. వీటి కోసం ఏళ్లుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని, ఎంతకాలం వాయిదా వేస్తారంటూ వారం క్రితం న్యాయస్థానం సీరియస్ అయింది. ఈరోజు జరిగిన విచారణకు పాఠశాల విద్యా కమిషనర్ హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నియామకాల ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు. 1,382 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వివరణ ఇవ్వడంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.
వారం క్రితం ఇలా…
MLC ఎలక్షన్ కోడ్ వల్ల భర్తీని ఆపాల్సి వచ్చిందని ఎన్నికలు పూర్తయ్యేవరకు గడువివ్వాలని ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై ఈనెల 3న విచారణ జరిపిన బెంచ్… ‘కోడ్’తో పాత నోటిఫికేషన్ కు సంబంధం లేదని, తమ ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. అది జరగలేదో ఉన్నతాధికారులు రావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. 2,367 మందిలో 1,382 మంది కాంట్రాక్టు ఉద్యోగాలకు ఆసక్తి చూపారని, వారిని తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే జనవరి 29న ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చిందన్న వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. 15 ఏళ్లకు పైగా ఎదురుచూస్తున్నారని, తమ ఆదేశాల ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినా అది అమల్లోకి రాకపోడంతో కోర్టు మరోసారి ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది.