నాయకులు చెప్పారని చార్మినార్, చివరకు హైకోర్టును కూడా కూల్చేస్తారా అని హైడ్రా అధికారుల్ని(Officials) హైకోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేద్దామంటే కుదరదని మొట్టికాయలు వేసింది. అమీన్ పూర్ కూల్చివేతల(Demolish)పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైడ్రా తీరు, కమిషనర్ వ్యవహారం, అధికారుల అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడింది. శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా.. అసలు ఆదివారం కూల్చకూడదన్న విషయం తెలియదా అని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.
‘డిజాస్టర్ అంటే కేవలం కూల్చడమే కాదు.. దానికి చాలా అర్థాలున్నాయి.. వాటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు.. తహసీల్దార్ అడిగితే యంత్రాలు, సిబ్బందిని ఇచ్చామంటున్నారు.. చార్మినార్, హైకోర్టు విషయంలోనూ అంతేనా.. హైడ్రా కమిషనర్ గా మీకు చట్టం తెలియదా.. రాజకీయ నాయకులు చెప్పింది వింటే మీరు ఇబ్బందులు పడతారు..’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలా న్యాయస్థానం విరుచుకుపడటంతో హైడ్రా అధికారులు నీళ్లు నమలగా.. తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.