వీధికుక్కల(Street Dogs) దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న(Deaths) ఘటనల్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. నిన్న హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఏడాదిన్నర బాలుడు మృతిచెందిన ఘటనపై హైకోర్టులో విచారణ సాగింది. దాడి ఘటనల్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రశ్నించగా.. ఇందుకోసం రాష్ట్రస్థాయి(State Level) కమిటీల్ని వేశామని ప్రభుత్వం తరఫున వాదనల్ని AG వినిపించారు.
హైదరాబాద్ లో 6 కేంద్రాల్లో శునకాలకు స్టెరిలైజ్ చేస్తున్నామని చెప్పగా.. అలా చేస్తే కరవకుండా ఉంటాయా అని న్యాయస్థానం ప్రశ్నించింది. స్టెరిలైజ్ ద్వారా దాడి ఘటనల్ని ఎలా ఆపుతారని ప్రశ్నించింది. AG సమాధానంపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
షెల్టర్ హోంలకి తరలించడమే పరిష్కారమని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది అన్నారు. నాగపూర్‌లో ఇలా 90 వేల శునకాల్ని షెల్టర్ హోమ్స్ లో పెట్టినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ భేటీ అయి దీనికో పరిష్కారం చూపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయస్థానం వారానికి వాయిదా వేసింది.