విద్యార్థుల స్థానికతపై ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు తీర్పు ప్రకటించింది. MBBS, BDS అడ్మిషన్లకు సంబంధించి జీవో 33ను న్యాయస్థానం సమర్థించింది. ఈ కోటా కింద స్థానికులంతా అర్హులేనని, పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే(Confirm) దరఖాస్తులని పరిగణలోకి తీసుకోవాలంటూ.. తెలంగాణ శాశ్వత నివాసులా, కాదా అన్న విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
వైద్యారోగ్య శాఖ జీవోను సవాల్ చేస్తూ పలువురు వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. స్థానికతపై ఇప్పటిదాకా మార్గదర్శకాలు(Guidelines) లేనందున దాని నిర్ధారణకు గైడ్ లైన్స్ రూపొందించుకోవాలని ఆదేశించింది. కొత్తగా తయారు చేసుకున్న గైడ్ లైన్స్ ను పాటించాలంటూ కాళోజీ వర్సిటీకి స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థుల అప్లికేషన్లనే లెక్కలోకి తీసుకోవాలని తీర్పు వెలువరించింది.
జీవోలో భాగంగా ‘నీట్’ పరీక్ష రాసే సమయం విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ సర్కారు జీవో విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు ఈ జీవో విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న CJ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన బెంచ్.. తీర్పును ప్రకటించింది.