ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ట్రాన్స్ ఫర్స్ పై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. బదిలీలు, ప్రమోషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ యూనియన్ల నేతలకు 10 అదనపు పాయింట్లను కేటాయించడాన్ని తప్పుబట్టింది. లీడర్లకు అడిషనల్ పాయింట్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ బదిలీలకు పర్మిషన్ ఇచ్చింది. యూనియన్ల ఆఫీస్ బేరర్లకు ప్రాధాన్యమివ్వడం సరైంది కాదంటూనే… మరోవైపు దంపతుల(Spouse)కు అదనపు పాయింట్లు కేటాయించేందుకు అనుమతినిచ్చింది. స్పౌస్ కోటాను నిర్దేశించింది భార్యభర్తలు కలిసి ఉండాలన్న ఉద్దేశం కోసమని… దీన్ని నిబంధనలకు అనుగుణంగా అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.
ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెలువరించింది. బదిలీలు, ప్రమోషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరిలో జీవో ఇస్తూ దంపతులతోపాటు యూనియన్ లీడర్లకు 10 పాయింట్లను కేటాయించింది. దీని ప్రకారం ఫిబ్రవరిలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్స్ కోసం 73,803 మంది అప్లయ్ చేసుకున్నారు. యూనియన్ లీడర్స్ కు ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించడంపై చాలా మందిలో అసంతృప్తి, ఆవేదన ఏర్పడ్డాయి. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం GOపై స్టే విధిస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో బదిలీలు, ట్రాన్స్ ఫర్లు ఆగిపోయాయి.
మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు చేయలేకపోతున్నామని, స్టే ఆర్డర్స్ పై త్వరగా నిర్ణయం తీసుకుంటే గందరగోళానికి తెరపడుతుందని ఈ నెలలో కోర్టుకు అడ్వొకేట్ జనరల్ విన్నవించారు. దంపతుల సంగతి సరే.. యూనియన్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించడం వల్ల వేలాది మంది అర్హులైన టీచర్లు నష్టపోతున్నారని పిటిషనర్లు వివరించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్స్ కు అనుమతినిచ్చింది. ఏడు నెలల తర్వాత ఈ ప్రక్రియకు ముందడుగు పడటంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నట్లయింది.