ఒకే కేసులో మూడు కేసులు నమోదు(File) చేయడాన్ని ఇప్పటికే తప్పుబట్టిన హైకోర్టు అందులో రెండింటిని కొట్టివేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై BRS మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై ఇదివరకే హైకోర్టు విచారణ జరిపి ఆక్షేపించింది. మాజీ MLAని అరెస్టు చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించిన కోర్టు.. ఆయనేమైనా రౌడీషీటరా అలా అదుపులోకి తీసుకోవడానికి అంటూ పోలీసుల తీరును తప్పుబట్టింది.
ఒకే కేసులో మూడు FIRలు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి పిటిషన్ వేయగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. రెండు FIRలను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో నరేందర్ రెడ్డికి పెద్ద ఉపశమనం(Relief) లభించినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.