తాజాగా ప్రకటించిన సివిల్ కానిస్టేబుళ్ల(Civil Constables) నియామకాల(Recruitment)కు అడ్డంకి ఎదురైంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా ఆదేశాలిచ్చింది. 4 ప్రశ్నలను తొలగించి తిరిగి మూల్యాంకనం(Evaluation) చేయాలని ఆదేశించింది. ఈ నాలుగు ప్రశ్నలను తెలుగులో ట్రాన్స్ లేట్ చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రశ్నలకు(Questions) అనువాదం(Translation) చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court)లో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటికి స్పష్టత ఇవ్వకుండానే రిజల్ట్స్ ప్రకటించారని, ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో ఆ క్వశ్చన్స్ ను వదిలేసే పరిస్థితి ఎదురైందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
పారాదీప్ పోర్టుకు బదులు ప్రదీప్ పోర్ట్
దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలూ తప్పుగా వచ్చాయని, పారాదీప్ పోర్ట్ అథారిటీకి బదులు ప్రదీప్ పోర్ట్ అథారిటీ అని ఇచ్చారని పిటిషన్ ద్వరా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, వారి అధ్యయనం తర్వాత ఇచ్చే రిపోర్ట్ కు అనుగుణంగా రిక్రూట్ మెంట్ చేపట్టాలని కోరారు. అయితే ఇంగ్లీషులో ఇచ్చిన ఆప్షన్స్ వాడుకలో ఉన్నవేనని, వాటిని అందరూ వాడుతున్నారని బోర్డు తరఫు లాయర్ వాదించారు. ఇరుపక్షాలను విన్న న్యాయమూర్తి.. పేపర్ లోని 57, 122, 130, 144 క్వశ్చన్ లను తొలగించాలని ఆదేశించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి తప్పుబట్టారు.
పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం
పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తిరిగి మూల్యాంకనం చేసిన తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. అయితే 5 రోజుల క్రితమే కానిస్టేబుళ్ల లిస్టును పోలీసు నియామక మండలి ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం నిర్వహించిన ఎగ్జామ్స్ కు 5 లక్షల మంది అటెండ్ అయ్యారు. అభ్యంతరాలపై బోర్డుకు లేఖ రాసినా, వాటిని తొలగించాలని కోరినా పట్టించుకోకపోవడంతో పలువురు కోర్టు మెట్లెక్కారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలపై ఇప్పటికే దృష్టిపెట్టిన నియామక రిక్రూట్ మెంట్ బోర్డు.. వారి స్థితిగతులపై ఎంక్వయిరీ నిర్వహిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కానిస్టేబుళ్ల నియామకానికి అడ్డంకి ఏర్పడింది.