కేటీఆర్ పై ACB నమోదు చేసిన కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దర్యాప్తు కొనసాగించవచ్చంటూ అవినీతి నిరోధక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఈ నెల 30 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీనిపై ఇరు పక్షాల న్యాయవాదులు పోటాపోటీగా సుదీర్ఘ వాదనలు వినిపించారు. KTR తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. మాజీ మంత్రిపై పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని సుందరం అంటే.. FIRలో పేర్కొన్న అంశాలే ఫైనల్ కాదని, ఇన్వెస్టిగేషన్ లో తేలే అంశాల ఆధారంగా మరిన్ని సెక్షన్లు చేర్చుతారని AG వివరించారు.
నిబంధనల ప్రకారం ACB ఫైల్ చేసిన కేసులో ప్రాథమిక దర్యాప్తు జరగాలని, ఇందుకు సమయం తీసుకోవాల్సి ఉంటుందని KTR లాయర్ గుర్తు చేశారు. ఈ నెల 18న పురపాలక శాఖ నుంచి కంప్లయింట్ ఇచ్చారని, ఆ మరుసటి రోజైన 19 నాడే కేసు ఫైల్ చేశారంటూ ఇది విరుద్ధమని కోర్టుకు వివరించారు. రెండు నెలల క్రితమే కేసు పెట్టాలని నిర్ణయించారని, అయితే గవర్నర్ ఆమోదించాకే ఫైల్ చేశారంటూ ఫార్ములా సంస్థకు విదేశీ కరెన్సీతో డబ్బు చెల్లించడం నేరమేనని AG ప్రతివాదనలు వినిపించారు. AG అందజేసిన గవర్నర్ కాపీని పరిశీలించిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనల్ని పరిగణలోకి తీసుకుని ఈ నెల 30 వరకు ఆయన్ను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే ACB దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.