BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ MP బండి సంజయ్ అరెస్టయిన కేసులో విద్యార్థికి ఊరట లభించింది. పేపర్ లీకేజీ కేసులో బాధితుడిగా మిగిలిన సదరు స్టూడెంట్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో డిబార్ అయిన హరీశ్ కు హైకోర్టులో సాంత్వన లభించింది. ఆయనపై డిబార్ ను ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది. హరీశ్ రాసిన ఎగ్జామ్స్ ఫలితాల(Results)ను వెంటనే వెల్లడించాలని విద్యాశాఖకు స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో హన్మకొండ జిల్లా కమలాపూర్ లో వివాదం చోటుచేసుకుంది. కమలాపూర్ కేంద్రంలో పరీక్ష మొదలైన కొద్దిసేపటికే హిందీ పేపర్ సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు BJP అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురిని అరెస్టు చేశారు. శివాజీ అనే స్టూడెంట్ గోడ దూకి వెళ్లి హరీశ్ క్వశ్చన్ పేపర్ ను కిటికీ నుంచి మొబైల్ తో ఫొటో తీశారని ఛార్జిషీట్ నమోదు చేశారు.
దీంతో సదరు విద్యార్థి మిగతా పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హరీశ్ హైకోర్టుకు వెళ్లడంతో.. న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో మిగతా ఎగ్జామ్స్ రాయగలిగాడు. కానీ అతడి రిజల్ట్స్ ను విద్యాశాఖ విత్ హెల్డ్ లో పెట్టింది. దీనిపై బాధిత విద్యార్థి మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. డిబార్ ఉత్తర్వులను కొట్టివేసింది. హరీశ్ రాసిన ఎగ్జామ్స్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని ఆదేశించింది.