అధికారులు (Officials) నిద్రపోతున్నారా… వారిని లేపడానికి వారం పడుతుందా అంటూ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వారంలో మూడుసార్లు భోజనం వికటించి(Food Poison) పిల్లలు ఇబ్బంది పడ్డ తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. నారాయణపేట జిల్లా మాగనూరు ZP హైస్కూలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. పాఠశాలల మధ్యాహ్న భోజనంలో సరైన నాణ్యత పాటించడం లేదంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే.. మరో జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కలిసి వాదనలు విన్నారు.
ఒకే స్కూల్లో మూడు సార్లు జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని, DEO నిద్రపోతున్నారా అని మండిపడగా, వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయవాది అనడంతో కోర్టు మరింత సీరియస్ అయింది. ‘జిల్లా విద్యాధికారిని సంప్రదించడానికి వారం పడుతుందా.. ఫోన్లు కూడా లేవా.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉన్నారా.. హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పనిచేస్తారా.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో వస్తారు.. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
విషయం తెలుసుకున్న అదనపు అడ్వొకేట్ జనరల్(AAG) ఇమ్రాన్ ఖాన్ ఆగమేఘాల మీద కోర్టుకు హాజరై క్షమాపణ కోరారు. మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామని విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఎలా ఉన్నాయని కోర్టు ప్రశ్నించగా.. AAG వివరణతో విచారణను మధ్యాహ్నానికి బెంచ్ వాయిదా వేసింది.