
భూసేకరణ విధానంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భూసేకరణ(Land Aquisition)లో అధికారుల తీరును తప్పుబట్టిన కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది. యాచారం మండలం మేడిపల్లిలో చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కుర్మిద్దతోపాటు మేడిపల్లిలో భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఆర్డర్స్(Orders)ను రద్దు చేసింది. ఫార్మాసిటీ భూసేకరణలో అధికారుల తీరు విడ్డూరంగా ఉందని పేర్కొంది. రెవెన్యూ డిపార్ట్ మెంట్ స్పెషల్ CS ఇచ్చిన మెమోను సైతం పక్కన పెట్టేశారంటూ ఆశ్చర్యపోయింది. ముందుగా ఆలోచన లేకపోయినా కోర్టుల్లో కేసులు ఫైల్ అయిన తర్వాత కూడా నిద్ర నుంచి తేరుకోవడం లేదని గట్టిగా ప్రశ్నించింది. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే బదులు వాటిని సవరించుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది.
అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారా అని హైకోర్టు ఆశ్చర్యపోయింది. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మీరు పనిచేస్తున్నారా అంటూ నిలదీసింది. కావాలనే ఏదో చేస్తూ ఉద్దేశపూర్వకంగా సర్కారీ విధానాలను పక్కనపెడుతూ చెడ్డపేరు తెస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ప్రస్తావించిన లోపాలను సరిదిద్ది ఉంటే మూడేళ్ల సమయం వృథా అయ్యేది కాదని కోర్టు అభిప్రాయపడింది. అభ్యంతరాలను కన్సిడర్ చేసి ల్యాండ్ అక్విజిషన్ ను మళ్లీ మొదలు పెట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. అటు నిర్వాసితులకు కూడా సూచన చేసింది. అభ్యంతరాల్ని రెండు వారాల్లో తెలిపి భూసేకరణకు సహకరించాలని ఆదేశాలిచ్చింది.