సాక్షాత్తూ హైకోర్టునే తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఒక బెంచ్ లో పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ విషయం దాచి మరో ధర్మాసనాని(Bench)కి వెళ్లారు. ఒకచోట పెండింగ్ లో ఉండగా, మరోచోట ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేస్తారా అంటూ రూ.కోటి జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు.
జరిగిందిదే…
బండ్లగూడ మండలం కందికల్ లో 310/1, 310/2లో 9.11 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయట్లేదంటూ వెంకట్రామిరెడ్డి పిటిషన్ వేశారు. ఆ సర్వే నంబర్లు గ్రామంలో లేవని, తప్పుడు పత్రాలతో కాజేయాలని చూస్తున్నారంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. సదరు భూమిపై పిటిషనర్ తండ్రి అప్పటికే రెండు పిటిషన్లు వేశారని, వీటి గురించి వెంకట్రామిరెడ్డి ప్రస్తావించలేదన్నారు. ఆ ప్రభుత్వ భూముల మీద యాజమాన్య హక్కులపై కేసులు నడుస్తున్నాయని, పాత పిటిషన్లను ప్రస్తావించకపోవడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు.. భారీ ఫైన్ వేసింది.