
నిజామాబాద్ జిల్లాను వానలు వణికిస్తున్నాయి. ఒకే రోజులో అత్యధిక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన మండలాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేల్పూర్ లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అదే జిల్లాలోని భీమ్ గల్ లో 23 సెంటీమీటర్లు, జక్రాన్ పల్లిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మరసుకుంట చెరువు తెగి వేల్పూర్ మొత్తం నీటితో నిండిపోయింది. అక్కడి ఆఫీసులన్నీ నీటిలోనే ఉండగా.. వేల్పూర్ మండలంలో మొత్తం మూడు చెరువులు తెగిపోయాయి. వేల్పూరు-ఆర్మూర్ రోడ్డుపై భారీగా ఫ్లడ్ వాటర్ చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
అటు వేల్పూరు మండలంలోని పచ్చలనడికుడలోనూ ఊరి చెరువు తెగింది. ఈ నీటి ఉద్ధృతికి ఆర్మూర్-భీంగల్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డులోనూ పోయే వీలు లేకపోవడంతో వెహికిల్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే మండలం పడిగెల్ లో నవాబు చెరువు తెగి వాటరంతా రోడ్డుపైకి వచ్చేసింది. చెరువు తెగిపోవడంతో పోచంపల్లి-అంక్సాపూర్ మార్గం మూసుకుపోయింది. వేల్పూరు మండలంలోని 10 గ్రామాలకు చెందిన పొలాలు నీట మునిగాయి.