ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాల సెంటర్లో గ్రూప్-4 పరీక్ష రాస్తూ ఫోన్ తో అభ్యర్థి పట్టుబడ్డాడు. ఎగ్జామ్ మొదలైన అర గంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి మాల్ ప్రాక్టీస్ కింద కేస్ బుక్ చేశారు. ఫోన్ సీజ్ చేసి ఎంక్వయిరీ కోసం అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.
గాలికి ఎగిరిపోయిన OMR షీట్
గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాల ఫస్ట్ ఫ్లోర్ లో విండో దగ్గర కూర్చున్న అభ్యర్థికి సంబంధించిన OMR షీట్ గాలికి ఎగిరి బయటపడింది. అక్కడి సిబ్బంది తిరిగి ఆ షీట్ ను అభ్యర్థికి అప్పగించారు.
డీజిల్ లేక ఆగిన బస్సు
వనపర్తి నుంచి నాగర్ కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డీజిల్ లేక గోపాల్ పేటలో ఆగిపోయింది. బుద్ధారం సెంటర్లో ఎగ్జామ్ రాసేవారు అందులో 40 మంది ఉండగా… బస్ ప్రాబ్లమ్ వల్ల ప్రైవేటు వెహికిల్స్ లో సెంటర్ కు చేరుకున్నారు.
ఒరిజినల్స్ లేక అభ్యర్థుల పంపివేత
నల్గొండ జిల్లా చండూరులోని మరియాకేతన్ ఎగ్జామ్ సెంటర్ లో ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుండా జిరాక్స్ తెచ్చారని ఐదుగురు అభ్యర్థుల్ని బయటకు పంపించారు.
కొంపముంచిన గూగుల్ మ్యాప్
గూగుల్ లొకేషన్ సెర్చ్ తో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అభ్యర్థికి నిరాశే మిగిలింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని కృష్ణవేణి స్కూల్ సెంటర్ కోసం గూగుల్ పెట్టుకుని లొకేషన్ కు చేరుకోగా… అది తప్పు అడ్రస్ అని అర్థమైంది. కానీ వెంటనే అక్కణ్నుంచి బయల్దేరి అసలు అడ్రస్ కు చేరుకునేసరికి నిమిషం ఆలస్యం కావడంతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు.
ట్రెయిన్ లో టెక్నికల్ ఇష్యూ
సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్ ప్రెస్ టెక్నికల్ ప్రాబ్లంతో ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచిపోయింది. అందులో పెద్ద సంఖ్యలో గ్రూప్-4 రాసే అభ్యర్థులున్నారు. చివరకు చేసేది లేక చాలా మంది ప్రైవేటు వెహికిల్స్ లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఆలస్యానికి మూల్యం
రాష్ట్రంలోని వివిధ సెంటర్లకు ఆలస్యంగా వచ్చిన 23 మందిని లోపలికి అనుమతించకుండా తిప్పి పంపించివేశారు. హైదరాబాద్ కూకట్ పల్లి సెంటర్ కు ఆలస్యంగా వచ్చిన ఏడుగురు, నాచారంలో ఇద్దరు, బాలానగర్ లో ఇద్దరు, సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ముగ్గురు, సంగారెడ్డి సెయింట్ ఆంటోని స్కూల్ సెంటర్లో ఆరుగురు, జోగిపేట ప్రభుత్వ కాలేజీలో ముగ్గురు అభ్యర్థులు… ఆలస్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.