దారి పొడవునా ఎద్దుల బండ్ల చప్పుళ్లు…
రాత్రి, పగలు తేడా లేకుండా ఫ్యాక్టరీ వద్దే పడిగాపులు…
ఎటు చూసినా చెరకు పంటలతో కళకళలాడే పల్లెలు…
పక్కనే ఫ్యాక్టరీ ఉందంటూ రైతుల మోముల్లో ఆనందం…
కానీ ఇపుడివన్నీ కనుమరుగై గత తొమ్మిదేళ్ల కాలంలో షుగర్ ఫ్యాక్టరీలనేవే కనిపించకుండా పోయాయి. మూతపడ్డ చక్కెర పరిశ్రమల(Sugar Factories)ను తెరిపిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించడంతో.. చెరుకు రైతుల్లో ఆనందం కనిపిస్తున్నది. తొమ్మిదేళ్ల క్రితం తాళాలు పడ్డ ఫ్యాక్టరీలను తెరిపించాలంటూ ఏళ్ల నుంచి డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని సందర్శించిన శ్రీధర్ బాబు.. అక్కడి రైతులకు భరోసానిచ్చారు. ఈ ఫ్యాక్టరీని తిరిగి నడిపిస్తే 1,500 మందికి ప్రత్యక్షంగా 6 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. 10 లక్షల టన్నుల సామర్థ్యం(Capacity) గల ఫ్యాక్టరీల ద్వారా వేలాది ఎకరాల్లో చెరుకు పంట సాగవుతుంది.
కర్మాగారాల కథ ఇది…
1938లో బోధన్, 1981లో ముత్యంపేట, 1988లో మొంబోజిపేట్ ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. 2002కు పూర్వం ఇవన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల సాకుతో TDP ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసింది. జాయింట్ వెంచర్ లో సర్కారుది 49 శాతం కాగా, 51 శాతం ప్రైవేటు భాగస్వామ్యం(Private Partnership) చేతుల్లోకి వెళ్లడంతో ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’గా మారిపోయింది. ఫ్యాక్టరీల్ని నడపడంలో కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డ యాజమాన్యం చివరకు వాటిని మూసేసింది. అలా 2015లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ప్రధాన ఫ్యాక్టరీతోపాటు దానికి అనుబంధంగా ఉన్న జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా మొంబోజిపేట్ లోని పరిశ్రమలను తెరిపించాలంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
కమిటీ సిఫార్సుల మేరకు…
మూతపడ్డ పరిశ్రమలు తెరిపించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 10 మంది సభ్యుల కమిటీకి ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్ గా, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కో-ఛైర్మన్ గా ఉన్నారు. MLC జీవన్ రెడ్డి, MLAలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ MLA చంద్రశేఖర్ సహా ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, కోఆపరేటివ్ ముఖ్య కార్యదర్శులతోపాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ MDలు కమిటీలో మెంబర్లుగా ఉన్నారు.
2004 నుంచి 2008 వరకు…
2004లో పగ్గాలు చేపట్టిన అప్పటి కాంగ్రెస్ సర్కారు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్ కు పంపింది. రైతులు, కార్మికులతో మాట్లాడిన కమిటీ.. ఫ్యాక్టరీని తిరిగి తెరిస్తేనే మేలంటూ 2008లో నివేదిక ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటామంటూ 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో KCR హామీ ఇచ్చారు. కానీ అది అమలు కాకపోవడం, చివరకు మేనేజ్మెంట్ ఆ ఫ్యాక్టరీల్ని కాస్తా ‘లేఆఫ్’గా ప్రకటించడంతో కార్మికులంతా రోడ్డున పడ్డారు. తద్వారా రైతులకు పంట లేకుండా పోయి నష్టాల పాలవ్వాల్సి వచ్చింది.
తుప్పు పట్టి…
వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన ఫ్యాక్టరీలు మూతపడటంతో వందల కోట్ల రూపాయల విలువైన మెషినరీ మొత్తం తుప్పు పట్టి పనికిరాకుండా పోయింది. పరిశ్రమల్ని అమ్మి కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ‘నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)’ తీర్పు ఇచ్చినప్పటికీ అదీ అమలు కాలేదు. గతేడాది ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి.. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని విజిట్ చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు కమిటీ వేయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.