నిజాయతీ(Honest), నిక్కచ్చి(Sincerely)… ఈ పదాలు వాడాలంటే అందుకు సరైన వ్యక్తులు, లేదా అధికారులు కనపడాలి. కానీ ఈ మధ్యన ఈ పదాన్ని అందరూ వాడుకుంటూ, అందరికీ వర్తింపజేస్తూ దానికున్న విలువ(Credibility)ని పాతరేస్తున్నారు. చేసేవి చాటుమాటు వ్యవహారాలు.. పైకి మాత్రం నిజాయతీపరుణ్నంటూ మాటల కోటలు.. ఊకదంపుడు ప్రచారాలు. అయితే సమాజంలో ఇంకా మంచి ఉంది కాబట్టే దానికి కట్టుబడ్డ వ్యక్తుల గురించి అప్పుడప్పుడైనా చెప్పుకోవాల్సి ఉంటుంది. నమ్ముకున్న నిజాయతీ వారిని నాలుగు గోడల లోపే కట్టేసినా.. ఎంతకీ వెరవనితత్వం వారిని ధీరోదాత్తులుగా నిలుపుతుంది.
అలాంటి కోవకే…
అలాంటి కోవకే చెందిన వ్యక్తి సీనియర్ IPS రాజీవ్ రతన్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ప్రస్తుత IPS అధికారుల్లో అత్యంత నిజాయతీపరుల లిస్ట్ లో ఆయన టాప్ లో ఉంటారు. ‘తలచింది చేయడానికి తలవంచని నైజమే’ ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 33 ఏళ్ల సర్వీసులో కీలక పోస్టులు దక్కింది కొద్దికాలమే అయినా తాను ఏ పోస్టునూ అప్రాధాన్యం(Unimportant) అనుకోలేదు. కామారెడ్డి ASPగా, విశాఖపట్నం అడిషనల్ SP(ఆపరేషన్స్), కేంద్ర సర్వీసుల్లో ITBP(Indo Tibetan Border Police) కమాండింగ్ ఆఫీసర్ గా, సైబరాబాద్ ఇంఛార్జి కమిషనర్ గా కీలక బాధ్యతలు చూశారు. కానీ ఆ తర్వాత ఆర్గనైజేషన్స్, ఫైర్ సర్వీసెస్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పనిచేశారు.
‘లూప్ లైన్’ పేరు పెట్టి…
సాధారణంగా కొన్ని పోస్టుల్ని అందరూ ‘లూప్ లైన్’గా భావిస్తారు. కానీ నిజానికి ఏ డిపార్ట్ మెంటూ ‘లూప్ లైన్’ కాదు. నిజాయతీ, కచ్చితత్వంతో పనిచేస్తే ఏ శాఖయినా ఒకటే. ఇందుకు జైళ్ల శాఖ DGగా పనిచేసిన వి.కె.సింగ్ పెద్ద ఉదాహరణ. ఎప్పుడూ సర్కారీ నిధులపైనే ఆధారపడే జైళ్ల శాఖలో సంస్కరణలు(Reforms) తీసుకువచ్చి సొంతంగా ఆదాయం తెచ్చి పెట్టిన వ్యక్తి ఆయన. పెట్రోల్ బంకులే దానికి నిదర్శనమైతే.. ఇప్పుడవి రాష్ట్రమంతటా భారీ ఆదాయానికి ఆలంబనగా నిలుస్తున్నాయి. కాబట్టి ఏ శాఖ కూడా ‘లూప్ లైన్’ కాదు బాగా పనిచేసే అధికారులకి. సరిగ్గా రాజీవ్ రతన్ కూడా అలాగే తన విధుల్ని నిర్వర్తించి నిజంగా ఇపుడున్న పరిస్థితుల్లో పోలీస్ శాఖకు ఎనలేని గౌరవాన్ని తెచ్చారు.
‘విజిలెన్స్’లో
కామన్ గా అందరూ ‘విజిలెన్స్’ను కూడా లూప్ లైన్ గానే చూస్తారు. కానీ రాజీవ్ రతన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కీలక విధులు నిర్వర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలపై విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రస్తుత సర్కారు నిర్ణయం తీసుకుంది. రేవంత్ టీమ్ మేడిగడ్డను విజిట్ చేసినప్పుడు సైతం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చింది రాజీవ్ రతనే. నిజామాబాద్ జిల్లాలో రూ.2,670 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ, సెక్రటేరియట్లో రూ.270 కోట్ల ఐటీ ప్రొక్యూర్ మెంట్, నారాయణపేట జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల్లో అక్రమాలపై ఆయన ఆధ్వర్యంలోనే విచారణలు జరుగుతున్నాయి. ఇలా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు కొద్దికాలంలో అపార గౌరవాన్ని కల్పించిన వ్యక్తిగా రాజీవ్ రతన్ నిలిచిపోయారు.
అందులో మేటి…
గోల్ఫ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి అంశాల్లో రాజీవ్ రతన్ మేటి. కొవిడ్ టైమ్ లోనే ఆయనకు స్టంట్స్ పడగా.. తిరిగి గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గం మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇలా ఆర్నెల్ల సర్వీసు ఉండగానే ప్రాణాలు కోల్పోవడం, అదీ ఉగాది నాడు కావడం బాధాకరంగా నిలిచింది. ఇలాంటి అధికారుల్ని సమీప భవిష్యత్తులోనైనా చూడగలమా అన్న మాటలు.. రాజీవ్ రతన్ అంకితభావాన్ని చూస్తే కలగకమానవు.