ప్రభుత్వ స్కూళ్లు, వసతిగృహాలు(Hostels) తరచూ వివాదాస్పదం కావడంపై సర్కారు దృష్టిసారించింది. హాస్టళ్లు సందర్శించాలంటూ(Visit) ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇక నేరుగా వారే రంగంలోకి దిగబోతున్నారు. CM, డిప్యూటీ CM సహా కీలక నేతలంతా హాస్టళ్ల విజిట్ కు బయల్దేరుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్ ద్వారా తెలిపారు. నెలలో ఒకరోజు ఇక నుంచి హాస్టళ్లను సందర్శిస్తామని, ఇందులో ముఖ్యమంత్రితోపాటు తామంతా భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు.
ఆ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి మొదలు పెడతామన్న భట్టి.. పిల్లలతో కలిసి భోజనం చేస్తామన్నారు. గత పదేళ్లలో పెరగని డైట్ ఛార్జీల్ని ఏడాదిలోనే పెంచామని, హాస్టళ్లలో వసతుల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల్లోని హాస్టళ్లలో కలెక్టర్లతో మధ్యాహ్న భోజనం నిర్వహించాలని డిప్యూటీ CM ఆదేశించారు.